Shortly new trains will commence?
త్వరలో కొత్త రైళ్లు
29/05/2013
హైదరాబాద్, మే 28: రాష్ట్రంలో వివిధ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రెండు కొత్త రైళ్లు షాలిమార్ వీక్లీ ఏసి ఎక్స్‌ప్రెస్ (12774/12773), కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17615/17616) సర్వీసులు ప్రారంభమయ్యాయి. రైల్వే బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు ఈ...
more... రెండు కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. త్వరలో డిమాండ్ ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన రైళ్లలో బయో టాయిలెట్లు(జీవ మరుగుదొడ్ల)ను ఏర్పాటు చేస్తామన్నారు. రైళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్లాట్‌ఫారంపై ప్రయాణీకులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. కర్నూలు, కాజీపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి స్ధల సేకరణ ప్రక్రియ ముగిసిందన్నారు. 2013 రైల్వే బడ్జెట్లో 13 కొత్త రైళ్లను ప్రకటించామన్నారు. ఈ రైళ్లను దశలవారీగా ప్రవేశపెడుతామన్నారు. ఈ ఏడాది వేసవి రద్దీని తట్టుకునేందుకు 400 కొత్త రైళ్లను నడుపుతున్నామన్నారు. అన్ని పెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు అదనపు టర్మినల్స్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రైళ్లను నడిపే యోచన ఉన్నట్లు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం కర్నూలు నుంచి రాజధానికి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను కూడా నడపాలనే ప్రతిపాదన ఉన్నట్లు ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను సికింద్రాబాద్ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ ప్రశంసించారు.
ఎంఎంటిఎస్ రెండో దశకు టెండర్లు
రాధానిలో ఎంఎంటిఎస్ రెండవ దశకు టెండర్లను పిలిచినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ డిపి పాండే తెలిపారు. 3 ప్యాకేజీల్లో 360 కోట్ల రూపాయల టెండర్లను పిలిచామన్నారు. ఈ టెండర్ల బిడ్స్‌ను వచ్చే నెల 14వ తేదీన పిలుస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఎంఎంటిఎస్ రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. 2016 నాటికి కాపాలాలేని క్రాసింగ్స్‌ను మూసివేసి వాటి స్ధానంలో సురక్షితమైన క్రాసింగ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునిక లాండ్రీ సదుపాయాలను కల్పించామన్నారు. రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతను పాటించకుండా పాడు చేసే వారిపై 9500 కేసులు నమోదు చేసి 19 లక్షల రూపాయల పెనాల్టీని విధించామన్నారు. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నకిలీ టిక్కెట్ ఏజెంట్ల ఆటకట్టించేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.